Saturday 12 July, 2008

పిలువకుమా అలుగకుమా....

"దేవుడు ఉన్నాడా...?? ఏదీ రమ్మనండి చూస్తాను."

దేవిడి విషయానికి వస్తే, మనుషులని మూడు రకాలుగా విభజించవచ్చు. దేవుడు లెనిదే సృష్టి లేదు అనీ, సకల చరాచర జీవకోటి అంతా భగవంతుని మహిమ అనీ, మనం కేవలం ఆ మహాత్ముని చేతి ఆటబొమ్మలమనీ నమ్మేవాళ్ళు మొదటి రకం. ఇక రెండో రకం.... దేవుడు అనే వాడే లేడు అనీ, ఉంటే ప్రజలకు ఈ కష్టాలు ఎందుకనీ, కళ్ళతో చూడలేని వాడు ఉన్నాడు అనటం మూర్ఖత్వం అనే వాళ్ళు. మిగిలింది మూడో రకం. దేవుడు అంటూ విడిగా ఉండడనీ, రాళ్ళల్లోనో రప్పల్లోనో లేదా కొండ మీద గుళ్ళల్లోనో దేవుడు ఉండడనీ, దైవం అనేది మనలో ఉంటుందనీ విశ్వసించేవాళ్ళు.

నేను ఈ మూడోకోవకు చెందిన దాన్ని.

దైవం కూడా ప్రేమ, అసూయ, అప్యాయతలవంటిదే. అది మనలో ఉంటుంది. మననించి వేరు చేసి చూపించటానికీ, అది ఉంది అని నిరూపించటానికీ వీలు లేనిది. చంటిపాప నవ్వులో దైవం ఉంటుంది, లేనివాడికి సహాయపడటంలో దైవం ఉంటుంది.

దైవం అనేది ఒక నమ్మకం. మనల్ని నడిపించే ఒక ధైర్యం. మనిషికి రేపు అనే రోజుకోసం ఎదురుచూడటానికి ఒక కారణం కావాలి. ప్రేయసి చేతి స్పర్శ, కన్న కూతురి చిరునవ్వు, అమ్మ చేతి ముద్ద...... ఆశ లేని జీవితం వ్యర్ధం సుమీ. ఆశ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట దైవం.

ఆ నమ్మకం అక్కర్లేని వాళ్ళూ దెవుడు అంటే మోసం అనుకుంటారు, అదే నమ్మకం లేకుండా ఉండలేని వాళ్ళు పరమ భక్తులుగా మారతారు. ఇక నా లాంటి వాళ్ళు అటూ ఇటూ వెళ్ళలేక త్రిశంకుస్వర్గంలో వేలాడుతారు.

కానీ........

ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒక మనిషిగా ఎదుటి మనిషిని గౌరవించటం మన కర్తవ్యం. ఈ విషయం గ్రహించినవాడు అద్రుష్టవంతుడు.

"నొప్పించక తానొవ్వక తప్పించికు తిరుగువాడు నేర్పరి సుమతీ"