Friday 8 May, 2009

అందమే ఆనందం......!

Beauty is skin deep అని వెనకటికి ఎవరో అన్నారట. అది ఎంత వరకూ నిజం?

ఒక సగటు మనిషి ఎవరైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వారి రూపం చుసే వారి మీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాడు. ఎలాంటివారైనా అందంగా ఉందే వారంటే ఆకర్షితులౌతారు, కురూపులకి దూరంగా ఉండాలనుకుంటారు. పెళ్ళిళ్ళ విషయంలో కూడా ముందు అమ్మాయి ఫోటో చూసి తన వ్యక్తిత్వాన్ని ఊహించటానికి ప్రయత్నిస్తారు. మన సినిమాల్లో కధానాయికలని అతిలోక సుందరులుగా చూపించి, హీరోలు వారి సౌందర్యానికి మంత్ర ముగ్ధులయ్యి వారితో ప్రేమలో పడి, ఆ ప్రేమ కోసం ప్రాణాలొడ్డి పోరాడినట్టు చిత్రీకరిస్తారు. సినిమాల్లో పాటలు కూడా హీరొయిన్ల అందాన్ని పొగుడుతూ ఉంటాయి కానీ, వారి తెలివితేటల గురించి కానీ, వారి వ్యక్తిత్వం గురించి కానీ ఎక్కడా ప్రస్తావన ఉండదు. అంటే ప్రేమకి అందం మాత్రమే కొలమానం అని ప్రేక్షకులకి పరోక్షంగా బోధిస్తున్నట్టే కదా?

మన ప్రచార సాధనాలు కూడా ఇదే భావనని ప్రోత్సహిస్తున్నాయి. బొమ్మల పెట్టెలో వచ్చే వాణిజ్య ప్రకటనలని ఎప్పుడైనా గమనించారా? వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ విజయం సాధించాలి అంటే అందంగా కనిపించటమే ముఖ్యం అనే ఒక భావం సుస్పష్టంగా కనిపిస్తుంది వీటిల్లో. అమ్మాయి నల్లగా ఉన్నప్పుడు కాదు అన్న పెళ్ళికొడుకు, అదే అమ్మాయి Fair and Lovely పూసుకుని తెల్లబడగానే చొంగ కారుస్తాడు. నల్లగా ఉన్నప్పుడు రాని ఉద్యోగం, అమ్మాయి తెల్లబడగానే వెత్తుక్కుంటూ వచ్చేస్తుంది. అమ్మాయి బొమ్మ గీస్తున్నప్పుడు ముందు మొహం మీద మచ్చలు గీసిన అబ్బాయి, అమ్మాయి Ponds రాసుకుని నున్నగా అయిపోగానే మచ్చలు చెరిపేసి, బొమ్మలో అమ్మాయి చేతికి ఉంగరం గీస్తాడు. నల్లగా ఉన్నప్పుడు ఛీ కొట్టిన అమ్మాయిలు, అబ్బాయి Fair and Handsome పూసుకుని తెల్లగా అవ్వగానే వాడి చుట్టూ చేరతారు.

So, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, యే రంగంలో అయినా విజయవంతం అవ్వటానికి అన్నిటికనా అందం ముఖ్యం.... అందం లేని జీవితం నిరర్ధకం....... ఇవేనా మనం యువతకి బొధించాల్సిన నీతులు?

నల్లగా ఉన్నప్పుడు అసహ్యించుకుని, తెల్లగా ఉన్నప్పుడు ప్రేమించే వాళ్ళు మనల్ని సంతోషపెట్టగలరా? రేపు మనంకటే తెల్లగా, అందంగా ఉండే వాళ్ళు కనిపిస్తే? అందం ఎంత వరకూ పనికొస్తుంది? అందంగా లేని వాళ్ళకి సంతోషంగా జీవించే అధికారం లేదా? అదే నిజమైతే మరి నాలాంటి వాళ్ళు ఏమవ్వాలి? ఎన్ని క్రీములు పూసినా, ఎంత డబ్బు తగలేసినా భగవంతుడు ఇచ్చిన రూపం ఇలాగే ఉంటుందే. అంటే ప్రేమలో పడే హక్కు, ఉన్నత పదవుల్లో పని చేసే అవకాశం నాకు లేవా?

అందం అనేది మనం వేసుకునే బట్టల్లోనో, వాడే క్రీముల్లోనో, పెట్టుకునే కళ్ళద్దాలలోనో ఉండదు. అందానికీ విజయానికీ సంబధం లేదు. విజయానికి కావలసింది ఆత్మవిశ్వాసం. అది కలగటానికి కొంతమంది అందంగా కనిపించటమే మార్గం అనుకుంటారు, కొంతమంది తెలివితేటలని నమ్ముకుంటారు.

Life comes in 256 shades of gray. ప్రతి మనిషిలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఎవరూ కూడా మన సినిమా హీరోల్లగా అతి మంచిగా, లేదా విలన్లలాగా పూర్తిగా చెడుగా ఉండరు. ఒక మనిషిలో మంచితనాన్నీ, తన సేవాభావాన్నీ చూసి అతన్ని ఇష్టపడాలి కానీ, తన బాహ్యసౌందర్యాన్ని చూసి కాదు. అందం శాశ్వతం కాదే. పూవు లాగానే అందం కూడా యవ్వనం కరిగిపోగానే వాడిపోతుంది కదా?

కోటి విద్యలూ కూటి కొరకే అని, అమ్ముకునే వాడు మనకి ఏదైనా చెప్తాడు, ఎంతకైనా దిగజారతాడు. విద్యతోపాటు విఙ్ఞానం పెంచుకుని తప్పొప్పులకి తేడా తెలుసుకుని మసులుకోవటం మన బాధ్యత.