Friday, 30 December 2011

తెలుగు భాషకి పోయే కాలం

'తియ్యని వేడుక చేసుకుందామ'
'ప్రతి ఒక్క ఫ్రెండు అవసరమే రా'
'మీ మాటలు ముగుస్తాయి కాని టాక్ టైము ముగియదు'
'మీ చర్మాన్ని హాని కలిగించే ఐదు లక్షణాలకి వద్దని చెప్పండి'

ఈ తెగులు మన వార్తా పత్రికల్లోనూ, టీవీలోనూ వచ్చే ప్రకటనల్లో వాడే సంకర తెలుగు. యముడితో భూలోకానికి వచ్చిన చిత్రగుప్తుడు పొలీసాయనతో చమత్కరించినట్టు ఇదే మన ఊళ్ళో లేటెష్టు ఫ్యాషన్. స్కూలుకి వెళ్ళే పిల్లలు, టీవీలో యాంకర్లు, సినిమాల్లో హీరోయిన్లు, ‘సువర్చలా’ అంటూ లైవ్ లో వార్తలు చదివే విలేఖరులు ఇలా అందరూ శక్తి వంచన లేకుండా తెలుగు భాషని నాశనం చెయ్యడానికి కృషి చేస్తున్నారు.

‘ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే’ అంటూ దాన వీర శూర కర్ణ లెవెల్లో తెలుగు మట్లాడటం ఎప్పుడో పోయింది. ణ, ళ, శ లు పొయాయి. పెళ్ళి ని పెల్లి, గణపతిని గనపతి, ఆకాశం ని అకాషం చేసేశారు. తెలుగు అంకెలు ఎలా ఉంటాయో, అసలు ఉంటయో లేదో కూడా ఎవరికీ గుర్తులేదు (ఒక్క రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి తప్ప – తెలుగు అంకెలు చూడాలంటే ఎదైనా ఆర్టీసీ బస్సుని ఫాలో అవ్వండి). ఇక తెలుగు లిపి విషయానికి వస్తే డైనోసార్లూ, డోడో పక్షుల లాగా మన లిపి కూడా త్వరలో అంతరించిపోతుంది. నిద్రలోనైనా చాటింగూ, మెయిల్స్ లో తెలుగుని ఇంగ్లీషులో టక టకా టైపు చేసే ఈ కాలంలో సగం మంది తెలుగు వాళ్ళకి తెలుగు అక్షరాలకీ చైనీసు రాతలకీ పెద్ద తేడా తెలీదు.

తేనెలాంటి తెలుగు భాష ఇలా తయారవ్వటానికి మనందరం బాధ్యులమే. ఆ మధ్య వార్తల్లో చుసా, ఏదో స్కూల్లో ఒక పిల్లాడు తెలుగు మాట్లాడితే చచ్చేట్టు కొట్టాడట టీచరు. ఇక ఆ దెబ్బతో కాస్తో కూస్తో తెలుగు మాట్లాడే వాళ్ళు, మాట్లాడదాం అనుకునే పిల్లలు బెదిరిపోయి వచ్చిన తెలుగు కుడా మర్చిపోయి ఉంటారు.

స్కూళ్ళ దాకా ఎందుకు, ఇళ్ళల్లోనే తెలుగు మాట్లాడటం పాపం అయిపోయింది. వందేళ్ళ క్రితం వచ్చిన ‘కన్యాశుల్కం’లోనే మన గిరీశం పంతులూ తన శిష్యిడూ ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ ష్టార్’ అని ఇంగ్లీషులో సంభాషించుకుంటుంటే ఆ పిల్లాడి ఇంట్లో తెగ మురిసిపోతారు. మరి దాదపు శతాబ్దం తరవాత ఇప్పటి తల్లిదండ్రులు మాత్రం ఎందుకు తగ్గుతారు. ఎవరి పిల్లలు బాగా ఇంగ్లీషు దంచుతారో వాళ్ళే గొప్ప.

మన తెలుగు భాష కల్తీ అవ్వటం వెనుక సినిమా పరిశ్రమ చెయ్యి కుడా ఉంది. హీరొయిన్లు వచ్చీ రానట్టుగా ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడటం బహుశా జీన్సు సినిమాతో మొదలయ్యింది. ఆ సినిమా వచ్చిన కొత్తల్లో మేము ఐశ్వర్య నత్తి డైలాగులు చెప్పుకుని తెగ నవ్వుకునేవాళ్ళం. అప్పుడు కలలో కూడా అనుకోలేదు సుమీ రాను రాను తెలుగు ఎంత చెత్తగా మట్టాడితే అంత స్టయిలు అని, స్వఛ్చంగా తెలుగు మాట్లాడేవాడిని ఎర్ర బస్సు పూర్ ఫెలోగా లెక్కకడతారని. హత విధీ!

ఇక్కడ తెలుగు సాహిత్యం గురించి చెప్పుకోవాలి. కాస్తో కూస్తో పుస్తకాలంటే మోజు ఉన్న నేను గమించింది ఏంటంటే చాలా కాలంగా తెలుగులో కొత్త రచనలు రావటం లేదు (రాంగోపాల్ వర్మ ‘నా ఇష్టం’ పుస్తకాన్ని సాహిత్యం అనటం గుడిలోకి చెప్పులు వేసుకెళ్ళినంత మహా పాపం). ఈ రోజుకీ మా నాన్న బెల్ బాటం, కర్లింగ్సు క్రాఫూ వేసుకుని కలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చిన యండమూరి పుస్తకాలూ, మా అమ్మ చిన్నప్పుడు ఆడవాళ్ళలో విప్లవం తెచ్చిన చలం రచనలూ, మా మామయ్యలో అభ్యుదయ భావాలు కలుగజేసిన వడ్డెర చండీదాస్ నవలలు - ఇవే పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి. అప్పటికీ వంశీ లాంటి యోధులు ‘మా పసలపూడి కథలు’ లాంటి ప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని పునరావిర్భవించటానికి ప్రయత్నిస్తున్నారు కానీ చేతన్ భగత్, అమీష్ త్రిపాటి లాంటి యువ 'రచయితల ' ధాటికి నిలవలేకపోతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే కాల మాన పరిస్థుతులు కానీ ఇలాగే కొనసాగితే ఒక వందేళ్ళలో అమెరికాలో ప్రవసాంధ్రుల ఇళ్ళల్లో తప్ప తెలుగు భాష ఎక్కడా వినిపించదేమో అనిపిస్తుంది. ఇక మన తెలుగు భాషని ఆ దేవుడే కాపాడాలి.

Friday, 25 February 2011

ఆలస్యం.. అమృతం... విషం

నా సుధీర్గ జీవితంలో చదువుకోసమనీ, ఉద్యోగరీత్యా కానీ, విహారయాత్రలనీ రకరకాల దేశాలు తిరిగి, అక్కడ మనుషుల అలవాట్లూ కట్టుబాట్లూ గమనించి, వాళ్ళ సంకృతీ సాంప్రదాయల్ని క్షుణ్ణంగా పరిశీలించి నేను కనిపెట్టిందేంటంటే - మనవాళ్ళకి తొందరెక్కువ! బస్సుల్లో, రైళ్ళల్లో, గుళ్ళల్లో, సినిమా హాళ్ళల్లో, రోడ్డుమీదా, ఇలా ఎక్కడ సందు దొరికితే అక్కడ అవసరమున్నా లేకపోయినా మనవాళ్ళు తెగ ఖంగారు పడిపోతుంటారు.

ఉదాహరణకి ఆ ఏడుకొండలవాడి సన్నిధైన తిరుమలనే తీసుకోండి. అయ్యవారి దర్శనార్ధం ఓపిగ్గా రోజంతా లైనులో నించున్న భక్తులు ఎందుకో గర్భగుడికి చేరుకోగానే పూనకమొచ్చినవాళ్ళలా ఒకరిమీద ఒకరు పడిపోయి తోసేసుకుంటారు. దేవుడిని చూసిన తన్మయత్వంలో, ఆయన్ని చేరుకోవాలన్న ఆతృతలో పక్కనున్న వాళ్ళమీద పడిపోతూ, ఈ క్రమంలో చుట్టుపక్కనున్న పసివాళ్ళూ, ఆడవాళ్ళూ, వయసైపోయిన ముసలివాళ్ళూ ఊపిరాడక నిజంగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారని గమనించరు. ఈ పరమ భక్తులని మాటలతో పూనకంలోంచి బయటకి లాగటానికి ప్రయతించే వెర్రివాళ్ళకి మిగిలేది కంఠశోషే. ఇలా ముక్కూ మొహం తెలీని వాళ్ళతో తోయించుకుని, వాగ్వివాదాల్లోకి దిగే ఓపిక లేకే నాలాంటి వాళ్ళు గుళ్ళకి వెళ్ళటం మానేశారు.

అలాగే మనవాళ్ళు అతి మమూలుగా, సాధారణంగా ఖంగారు పడేది రోడ్లమీద. కొంపలు మునిగిపోతున్నట్టు, ఎవరి ప్రాణాలో పోతున్నట్టు, అర్జెంటుగా ప్రకృతి పిలిచేస్తున్నట్టు, ఏ ర్యాలీ రేసులోనో పోటీ పడుతున్నట్టూ ఫీలయ్యి మరీ బళ్ళు నడుపుతుంటారు. ట్రాఫిక్కులో ముందున్నవాడు ఎటూ వెళ్ళటానికి లేదని కనిపిస్తున్నా , మనవాళ్ళు తమకి భార్య మీదా, బాసు మీదా ఉన్న కసినంతా హారను మీద చూపిస్తూ దబాయించి మరీ చెవులు పేలిపోయేలా హారను మోగించేస్తుంటారు. పాపం ముందున్నవాడు ఎటూ కదల్లేక, వెనకవాడి హారను దాడి భరించలేక, విసుగోచ్చేసి ఆ చిరాకుని తన హారను మీద చూపిస్తాడు. దాంతో రోడ్డంతా ఒక భీకర కచేరీలాగా తయారవుద్ది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది, మనవాళ్ళు రోడ్డుమీద తారాజువ్వలా దూసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా పక్కన బండి నడిపేది ఆడ లేడీసని కనిపిస్తే మాత్రం అంత ఖంగారులోనూ ఒక చూపుతోనో ,కుదిరితే ఒక మాటతోనో చురకవేసి మరీ వెళతారు. ఆ స్పీడులో బండి తోలే ఆడ లేడీసుని గ్రహాంతరవాసులుగా పొరబాటు పడతారేమోనని నా అనుమానం.

ఇహపోతే, సినిమా హాళ్ళు. అది మల్టీప్లెక్సయినా, ఊరి చివరి పురాతన టాకీసయినా, టికెట్ల దగ్గరా, ఇంటర్వెల్లులో కూల్డ్రింకులూ, చిప్స్సూ కొనేటప్పుడూ తోపులాటలో మనవాళ్ళు మగధీరుడిని తలపించేస్తారు. ఇదే తంతు బస్సులు ఎక్కేటప్పుడూ చూస్తాము. సహారా ఎడారిలో యేడాది ఎదురు చూసాక వాటరు ట్యాంకరు కనిపించినట్టు బస్సు రాకని గద్దల్లాగా అల్లంత దూరం నించే గమనించి ఆగీ ఆగకుండానే ఒకరినొకరు తోసుకుని మరీ బస్సు ఎక్కేందుకు ప్రయతించేస్తారు.

పోనీ చదువూ సంధ్యా లేని పల్లెటూరు బాబులు మాత్రమే ఇలా ఉన్నదానికీ లేనిదానికీ ఖంగారు పడతారా అంటే పరదెశీ డిగ్రీలు చదువుకుని, ఖరీదైన సూటూ బూటూ తొడుక్కుని, వేలకివేలు పోసి ఫ్లైట్లల్లో తిరిగే బడాబాబులదీ ఇదే బాపతు. ఎయిర్ హోస్టెస్ మైకులో మొత్తుకునేది ఏదీ చెవిన వేసుకోకుండా విమానం నేలకి తాకగానే ఫోనులు ఆన్ చేసేసి, వ్యాపార లావాదీవీలన్నీ మాట్టాడేస్తూనే సీటు బెల్టు పీకేసి, పైకి లెగిసేసి, ఇంకా కూర్చునే ఉన్నవాళ్ళ బుర్ర బద్దలయ్యేలా పైన బ్యాగులు లాగేసి, ఇంకా విమానం తలుపు తియ్యలేదని కనిపిస్తున్నా ముందున్న వాళ్ళని నెట్టేసి, గేటు తీయగానే పరిగెత్తుకుంటూ మరీ ముందు విమానంలోంచి బయటపడి విజయ దరహాసం చెయ్యటం మనవాళ్ళకి అలవాటు. తమాషా ఏంటంటే ఎంత తోసేసుకుని, పొడిచేసుకుని ముందు విమానం దిగినా టెర్మినల్ చేరుకోటానికి మళ్ళీ అందరూ కింద బస్సు ఎక్కాల్సిందే, విమానంలోంచి ఆఖరు ప్రయాణీకుడు దిగేదాకా బస్సు ఆగాల్సిందే.

ఇంతకీ మనవాళ్ళకి ఇంత తొందర ఎందుకు? ఎల్కేజీలోనే ఐఐటీ కోచింగూ, పదేళ్ళకే డ్రైవింగూ , పదిహేనేళ్ళకే సిగరెట్టూ మందూ, పద్దెనిమిదేళ్ళకే ప్రేమా, ఇరవైయేళ్ళకల్లా పెళ్ళీ సంసారం, ఇలా పాతికేళ్ళకే జీవితమంతా చూసేసే మనకి తొందర అనేది జీన్సులో (తొడుకున్నేది కాదండోయి) ఉందేమో. పప్పులో ఎక్కువైంది ఉప్పో కారమో పులుపో కనిపెట్టలేని నా జీనియస్సు బుర్రకి ఇది మాత్రం పెద్ద మిస్టరీయే.

Tuesday, 8 February 2011

నా స్వయంవర గా(బా)ధ

'You have to spare one Sunday evening dear' - నాన్న. ఎందుకూ అన్నట్టు సగం భయపడుతూనే నేనో లుక్కు. 'స్వయంవరం' - నాన్న. గుండె గుభేలు.

నా తోటి వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని తల్లులు/తండ్రులు అయిపోయారన్న సంగతి నేను పట్టించుకోకపోయినా, మా నాన్న ఈ విషయం మర్చిపోలేదు. ఏదోటి చేసి సుఖంగా బ్రతుకుతున్న నన్ను సంసార సాగరంలోకి నెట్టేద్దామని శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటారు.

అందులో భాగమే ఈ స్వయంవరం. ఇలాంటి వాటి గురించి పేపర్లో చదివి ఆ అభాగ్యులను తలుచుకుని నవ్వుకోటమే తప్ప, నెనూ వళ్ళల్లో ఒకరిని అవుతానని యేనాడూ అనుకోలేదు సుమీ. 'చచ్చింది కోడి' అని మనసులో అనుకుని, ఫ్రీగా ఫుడ్డు పెడుతున్నందుకు ఈ మాత్రం చెయ్యచ్చులే అని తలూపాను.

ఇంతలోకి ఆ 'Sunday Evening' రానే వచ్చింది. ప్రతి రోజులాగా jeans వేసుకుంటే స్వయంవరానికి వేంచేసే వధూవరులూ, వారి తల్లిదండ్రులూ బెదిరిపోతారని, వెతికి మరీ BC కాలం నాటి కుర్తీ ఒకటి తగిలించుకుని బయలుదేరా.

కారు తోలుంతున్నంత సేపూ నా మనసులో ఏవో ఆలోచనలు, అనుమానాలూ. వేలం పాటా, మేకల సంతా, ఇవే గుర్తుకొస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాదంతా బిర్యానీ లాగించి తన్నిపెట్టుకుని పడుకుంటున్న టైములో మేము మాత్రం trafficలో గంటసేపు ఈదుకుంటూ స్వయంవర ప్రాంగణానికి చేరుకున్నాం.

కారు park చేసి కిందకి దిగగానే అందరి చూపూ నా మీదే ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు. registration counter దగ్గర మా నాన్న కుస్తీ పడుతూండగా, నిలువు బొట్టు పెట్టుకుని, సఫారీ సూటు వేసుకున్న ఓ పెద్దాయన మెల్లగా నడుచుకుంటూ మా దగ్గరకి వచ్చాడు. 'మీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా?' నాకు నవ్వూ ఆశ్చర్యం, రేండూ ఒకే సారి పోటీ పడి మరీ వచ్చాయి. ఏమనాలో తెలీక మా అమ్మ నా వైపు చూపించింది, పై నించి కింద దాకా నిశితంగా పరిశీలించి 'ఆహా బ్రహ్మాండం' అని పాసు మార్కులు వేసాడాయన. ఇంకా interrogation చేసేలోపు మా నాన్న వచ్చి 'మా అమ్మాయి హైదరబాదులోనే ఉంటుందండీ' అని ఆ పెద్దాయనకి షాకు ఇవ్వటంతో ఆయన నన్నూ మా నాన్ననీ అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

ఈ తతంగమంతా ఎవరన్నా చూసారేమోనని ఇబ్బందిగా అటూ ఇటూ చూస్తూ అలాగే నిలబడ్డాను. ఒక గంట బయట ఎండలో నించోబెట్టి పక్కనే ఉన్న ఓ పురాతన auditoriumకి తోలారు మా అందరినీ. కూర్చుంటే విరిగిపోటానికి రెడీగా ఉన్న సీట్లల్లో ఇరుక్కుని అటూ ఇటూ మెసులుతూ ఇంకో గంట కాలక్షేపం చేసాక స్పీకర్లూ మైకూ టెస్టింగు చేసుకుని నిర్వాహకులు స్టేజీ ఎక్కారు. అప్పుడు ఆట మొదలైంది, నాకు మిస్టరీ వీడింది.

"Prospective brides and grooms" ఫోటోలు ఒక తెరమీద వేసి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, అనగా "Bio data" చదవసాగారు. నచ్చినవాళ్ళు సదరు అమ్మాయి/అబ్బాయి profile number/details రాసుకుంటున్నారు. నా నంబరు దగ్గరపడుతుంటే నాకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మొత్తానికి కనీ కనిపించకుండా నా ఫోటో వేసి, వినీ వినిపించకుండా ఏదో గొణిగి next profileకి వెళ్ళిపోయారు. అసలు నేను ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో, ఇదేం స్వయంవరమో అర్ధంకాక అలాగే బిక్కచచ్చి కూర్చున్నా. నోరు తెరిస్తే నా ముందున్నాయన గుర్రుమని నాకేసి చూస్తున్నాడు. So ఆ స్వతంత్రం కూడా లేకుండా పోయింది. మెల్లి మెల్లిగా నా ఇంద్రియాలు ఒక్కొక్కటీ పని చెయ్యటం మానేస్తున్నాయి. ఇంతలో కార్యక్రమం నిర్వహించటానికి డబ్బులిచ్చిన పెద్దమనిషి స్టేజి ఎక్కి మైకు అందుకున్నాడు. 'ఆహా మన కులం అదీ, ఇదీ. వీడు మనవాడు, వాడు మనవాడు. వీళ్ళని చూసి మనం గర్వపడాలి' అని ఇద్దరు రౌడీలు, ముగ్గురు రాజకీయ నాయకుల పేర్లు చదివాడు. దానితో, పోకిరిలో మహేష్ బాబు అన్నట్టు, దిమ్మ తిరిగి mind block అయ్యి, వెంటనే అక్కడనించి బయట పడ్డాము

మైకు హోరుకి తలవాచిపోయి, కూర్చునీ కూర్చునీ కాళ్ళు పీక్కుపోయి, ఒక్కసారే బయట గాలి తగలగానే ప్రాణం లేచివచ్చింది. ఆకలి మాడుతుండటంతో దగ్గర్లో ఉన్న హోటలుకెళ్ళి కూర్చున్నాం. ఒక్క సారి చుట్టూ పరికించాను. అక్కడ నన్నెవరూ చూడట్లేదు, నా గుణగణాలు బేరీజు వెయ్యట్లేదు. హమ్మయ్య అని మనసులో అనుకుని సుష్టుగా భోంచేసి, బిల్లు కట్టి, బయటకొచ్చి మెల్లగా వీస్తున్న శీతగాలిలో ఒక్కసారి మనసారా ఊపిరి పీల్చుకుని, ఇంకోసారి ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని ఒట్టు పెట్టుకుని, ఇంటి మొహం పట్టాను.