నా సుధీర్గ జీవితంలో చదువుకోసమనీ, ఉద్యోగరీత్యా కానీ, విహారయాత్రలనీ రకరకాల దేశాలు తిరిగి, అక్కడ మనుషుల అలవాట్లూ కట్టుబాట్లూ గమనించి, వాళ్ళ సంకృతీ సాంప్రదాయల్ని క్షుణ్ణంగా పరిశీలించి నేను కనిపెట్టిందేంటంటే - మనవాళ్ళకి తొందరెక్కువ! బస్సుల్లో, రైళ్ళల్లో, గుళ్ళల్లో, సినిమా హాళ్ళల్లో, రోడ్డుమీదా, ఇలా ఎక్కడ సందు దొరికితే అక్కడ అవసరమున్నా లేకపోయినా మనవాళ్ళు తెగ ఖంగారు పడిపోతుంటారు.
ఉదాహరణకి ఆ ఏడుకొండలవాడి సన్నిధైన తిరుమలనే తీసుకోండి. అయ్యవారి దర్శనార్ధం ఓపిగ్గా రోజంతా లైనులో నించున్న భక్తులు ఎందుకో గర్భగుడికి చేరుకోగానే పూనకమొచ్చినవాళ్ళలా ఒకరిమీద ఒకరు పడిపోయి తోసేసుకుంటారు. దేవుడిని చూసిన తన్మయత్వంలో, ఆయన్ని చేరుకోవాలన్న ఆతృతలో పక్కనున్న వాళ్ళమీద పడిపోతూ, ఈ క్రమంలో చుట్టుపక్కనున్న పసివాళ్ళూ, ఆడవాళ్ళూ, వయసైపోయిన ముసలివాళ్ళూ ఊపిరాడక నిజంగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారని గమనించరు. ఈ పరమ భక్తులని మాటలతో పూనకంలోంచి బయటకి లాగటానికి ప్రయతించే వెర్రివాళ్ళకి మిగిలేది కంఠశోషే. ఇలా ముక్కూ మొహం తెలీని వాళ్ళతో తోయించుకుని, వాగ్వివాదాల్లోకి దిగే ఓపిక లేకే నాలాంటి వాళ్ళు గుళ్ళకి వెళ్ళటం మానేశారు.
అలాగే మనవాళ్ళు అతి మమూలుగా, సాధారణంగా ఖంగారు పడేది రోడ్లమీద. కొంపలు మునిగిపోతున్నట్టు, ఎవరి ప్రాణాలో పోతున్నట్టు, అర్జెంటుగా ప్రకృతి పిలిచేస్తున్నట్టు, ఏ ర్యాలీ రేసులోనో పోటీ పడుతున్నట్టూ ఫీలయ్యి మరీ బళ్ళు నడుపుతుంటారు. ట్రాఫిక్కులో ముందున్నవాడు ఎటూ వెళ్ళటానికి లేదని కనిపిస్తున్నా , మనవాళ్ళు తమకి భార్య మీదా, బాసు మీదా ఉన్న కసినంతా హారను మీద చూపిస్తూ దబాయించి మరీ చెవులు పేలిపోయేలా హారను మోగించేస్తుంటారు. పాపం ముందున్నవాడు ఎటూ కదల్లేక, వెనకవాడి హారను దాడి భరించలేక, విసుగోచ్చేసి ఆ చిరాకుని తన హారను మీద చూపిస్తాడు. దాంతో రోడ్డంతా ఒక భీకర కచేరీలాగా తయారవుద్ది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది, మనవాళ్ళు రోడ్డుమీద తారాజువ్వలా దూసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా పక్కన బండి నడిపేది ఆడ లేడీసని కనిపిస్తే మాత్రం అంత ఖంగారులోనూ ఒక చూపుతోనో ,కుదిరితే ఒక మాటతోనో చురకవేసి మరీ వెళతారు. ఆ స్పీడులో బండి తోలే ఆడ లేడీసుని గ్రహాంతరవాసులుగా పొరబాటు పడతారేమోనని నా అనుమానం.
ఇహపోతే, సినిమా హాళ్ళు. అది మల్టీప్లెక్సయినా, ఊరి చివరి పురాతన టాకీసయినా, టికెట్ల దగ్గరా, ఇంటర్వెల్లులో కూల్డ్రింకులూ, చిప్స్సూ కొనేటప్పుడూ తోపులాటలో మనవాళ్ళు మగధీరుడిని తలపించేస్తారు. ఇదే తంతు బస్సులు ఎక్కేటప్పుడూ చూస్తాము. సహారా ఎడారిలో యేడాది ఎదురు చూసాక వాటరు ట్యాంకరు కనిపించినట్టు బస్సు రాకని గద్దల్లాగా అల్లంత దూరం నించే గమనించి ఆగీ ఆగకుండానే ఒకరినొకరు తోసుకుని మరీ బస్సు ఎక్కేందుకు ప్రయతించేస్తారు.
పోనీ చదువూ సంధ్యా లేని పల్లెటూరు బాబులు మాత్రమే ఇలా ఉన్నదానికీ లేనిదానికీ ఖంగారు పడతారా అంటే పరదెశీ డిగ్రీలు చదువుకుని, ఖరీదైన సూటూ బూటూ తొడుక్కుని, వేలకివేలు పోసి ఫ్లైట్లల్లో తిరిగే బడాబాబులదీ ఇదే బాపతు. ఎయిర్ హోస్టెస్ మైకులో మొత్తుకునేది ఏదీ చెవిన వేసుకోకుండా విమానం నేలకి తాకగానే ఫోనులు ఆన్ చేసేసి, వ్యాపార లావాదీవీలన్నీ మాట్టాడేస్తూనే సీటు బెల్టు పీకేసి, పైకి లెగిసేసి, ఇంకా కూర్చునే ఉన్నవాళ్ళ బుర్ర బద్దలయ్యేలా పైన బ్యాగులు లాగేసి, ఇంకా విమానం తలుపు తియ్యలేదని కనిపిస్తున్నా ముందున్న వాళ్ళని నెట్టేసి, గేటు తీయగానే పరిగెత్తుకుంటూ మరీ ముందు విమానంలోంచి బయటపడి విజయ దరహాసం చెయ్యటం మనవాళ్ళకి అలవాటు. తమాషా ఏంటంటే ఎంత తోసేసుకుని, పొడిచేసుకుని ముందు విమానం దిగినా టెర్మినల్ చేరుకోటానికి మళ్ళీ అందరూ కింద బస్సు ఎక్కాల్సిందే, విమానంలోంచి ఆఖరు ప్రయాణీకుడు దిగేదాకా బస్సు ఆగాల్సిందే.
ఇంతకీ మనవాళ్ళకి ఇంత తొందర ఎందుకు? ఎల్కేజీలోనే ఐఐటీ కోచింగూ, పదేళ్ళకే డ్రైవింగూ , పదిహేనేళ్ళకే సిగరెట్టూ మందూ, పద్దెనిమిదేళ్ళకే ప్రేమా, ఇరవైయేళ్ళకల్లా పెళ్ళీ సంసారం, ఇలా పాతికేళ్ళకే జీవితమంతా చూసేసే మనకి తొందర అనేది జీన్సులో (తొడుకున్నేది కాదండోయి) ఉందేమో. పప్పులో ఎక్కువైంది ఉప్పో కారమో పులుపో కనిపెట్టలేని నా జీనియస్సు బుర్రకి ఇది మాత్రం పెద్ద మిస్టరీయే.
5 comments:
చాలా బాగుంది...రెడ్ సిగ్నల్ దగ్గర బాగా చూస్తా ..ఇంకో 5 సెకెన్లు ఉందనగానే బయలుదేరిపోతారు...ఎందుకో అక్కడ అంత హడావిడి నాకిప్పటికీ అర్థం కాదు...కానీ గుడికి వెళ్లడం మానేయడానికి మంచి కారణం దొరికింది :)
సమయం విలువ తెలియని వాళ్ళకు ఇంక చెప్పేదేముంటుంది.జీవితమే క్షణభంగురమన్నారు మరి ఓ రెండు మూడు క్షణాల కోసం తొందరపడితే తప్పేముంది :)
నేనైతే ఎవరైనా హారను హాంకితే ఓ ఎక్ష్ప్రెషను లేని లుక్కిచ్చి తాపీగా ఇటుతిరిగి బండి ఆఫ్‌చేసి "ఇక నీ ఇష్టం. నువ్వెంతగా కావాలంటే అంతగా హాంకొచ్చు. I'm all ears" అన్నట్టు ప్రవర్తిస్తాను.
ఆడ లేడీస్ నలా వదిలెయ్యండి. బండి తోలేటప్పుడు కూడా ఏదైనా గుడో, చర్చో కం సే కం ఓ బొమ్మో కనబడితే కొందరు స్టైలుగా వేళ్ళు నాక్కుంటారు (సారీ ముద్దెట్టుకుంటారు) ఇందులో భక్తి కొంచెం ఎక్కువవున్నవారు కళ్ళూ కూడా క్షణకాలం పాటు మూస్తారనేది నా పరిశీలన. ఇది ఏ సాంప్రదాయమూ, ఇలా చేయమని ఎవరు ఎప్పుడు చెప్పారు అన్న విషయాలను పక్కన బెడితే ఆ టైం లో బండి కి ఏదైనా అడ్డంవస్తే పరిస్థితి ఏమవుతుంది? అంతగా భక్తి పొంగిపొర్లి గుండెల్లోంచి కారిపోతుంటే తిన్నగా ఆగి లొపలికివెళ్ళి పొర్లుదండాలే పెట్టవచ్చు కదా? బహుశా అంత తీరిక లేక కావచ్చు.
nee blogu ni... naa maatru bhasha lo chadivaka kuda ... naa vachi raani english lo reply chesthe ... naa antha bose dk .. inkokadu vundaru ..!!!
sinnapati nundi adi mana alavaatu .. schoollo inti bellu kottaka munde... sanchi bujana vesukoni ... nikkaru oka chetto pattukoni.. intiki parugedatharu(mu) ... appatinundi .. start ayyi .. eppudu aaputharo(mo) teliyadu ee tondara vandara.. !!!
Love you writing style. I wish you write more often.
Thanks Srujana. I too want to write more often, but it is too much effort :D
Post a Comment